
- రైతు భరోసా ఎగ్గొట్టారని.. బోనస్ అందరికీ ఇవ్వలేదని ఆరోపణలు
- వారి ఆందోళనల మధ్యే ముగిసిన గవర్నర్ జిష్ణుదేవ్ స్పీచ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి బుధవారం గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రసంగించగా.. బీఆర్ఎస్ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు. రన్నింగ్ కామెంట్రీలు, నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొన్నది. వారి నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, కుల గణన సర్వే, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగిలారు.
అంతా బోగస్.. గోబెల్స్ ప్రచారం.. ఫేక్.. అన్నీ అబద్ధాలే అంటూ కామెంట్ చేశారు. 20 శాతం కమీషన్లు అంటూ రన్నింగ్ కామెంట్రీ చేశారు. ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఎగ్గొట్టిందని, అందరికీ బోనస్ అందలేదని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎక్కువసార్లు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా కూర్చుండిపోయారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం ముగిసింది.
కేసీఆర్‌ను పలకరించిన మంత్రి తుమ్మల
గవర్నర్ ప్రసంగం కంటే ముందే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలోకి వచ్చి కూర్చున్నారు. అసెంబ్లీలోనే ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదే సందర్భంలో మంత్రి తుమ్మల ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలు సుకున్నారు.
అసెంబ్లీ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. గౌరవప్రదంగా సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగా.. కొందరు మంత్రులు, సభ్యులు ఆలస్యంగా వచ్చారు.